Chandrababu: చంద్రబాబు వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన మహిళా సంఘాలు

  • ఎన్నికల సభల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు
  • చంద్రబాబు వ్యాఖ్యలపై మహిళా సంఘాల ఆగ్రహం
  • ఈసీ, జాతీయ మహిళా కమిషన్ కు లేఖ రాస్తామన్న ఏపీ మహిళా కమిషన్
Women organisations complains against Chandrababu to AP Women Commission

టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఎన్నికల ప్రచార సభల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతుండడం తెలిసిందే. ఈ చట్టంతో ప్రజలు సొంత భూములపై హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం గురించి సభల్లో మాట్లాడేటప్పుడు చంద్రబాబు చేసిన కొన్ని వ్యాఖ్యల పట్ల ఏపీలోని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

చంద్రబాబు వ్యాఖ్యలను మహిళా సంఘాల నేతలు నేడు ఏపీ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాల నేతలు కోట సామ్రాజ్యం, ఏనుగుల దుర్గాభవాని, సెల్వం దుర్గ, డాక్టర్ సెల్ అధ్యక్షులు అంబంటి నాగ రాధాకృష్ణ, డేవిడ్ తదితరులు ఇవాళ ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మిని కలిసి వినతిపత్రం అందించారు. 

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతూ సీఎం జగన్ ను ఉద్దేశించి "నీ అమ్మ మొగుడిదా, అమ్మమ్మ మొగుడిదా, నానమ్మ మొగుడిదా" అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం అని వారు పేర్కొన్నారు. "తల్లి మొగుడిదా" అంటూ అంత వయసున్న చంద్రబాబు ఎలా మాట్లాడతారని విమర్శించారు. 

దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి స్పందించారు. మహిళను, మాతృమూర్తి స్థానాన్ని అవహేళన చేస్తూ మాట్లాడటం బాధాకరం అని అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా సీఎం జగన్ ను ఉద్దేశించి "నీ అమ్మ మొగుడు వచ్చినా భయపడను" అన్నారని వెంకటలక్ష్మి వెల్లడించారు. మహిళలను గౌరవించలేని వ్యక్తులు రాజకీయాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తుల గురించి నీచంగా మాట్లాడటం సంస్కారం కాదని హితవు పలికారు. 

అయితే, ఎన్నికల కోడ్ అంటూ మహిళా కమిషన్ ఆదేశాలను అధికారులు సీరియస్ గా తీసుకోవటం లేదని ఆమె ఆరోపించారు. మహిళా కమిషన్ కు ఎలక్షన్ కమిషన్ ప్రోటోకాల్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యల పట్ల కేంద్ర ఎన్నికల సంఘానికి, జాతీయ మహిళా కమిషన్ కు లేఖ రాస్తామని గజ్జల వెంకటలక్ష్మి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News